ఏడేళ్ల పాటు నిండుకుండలా ఉన్న వరద కాలువ ప్రస్తుతం నీటి జాడ లేక బోసిపోతోంది. గత అక్టోబర్ 9న మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద కాలువకు గండి పడినప్పటి నుంచి ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్) నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దీంతో బాల్కొండ, ముప్కాల్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పునరుజ్జీవ పథకం ద్వారా 122 కిలోమీటర్ల వరద కాలువకు జీవం పోశారు. దీనివల్ల 34 తూముల ద్వారా 80 చెరువులు నిండటంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు సుముఖత చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల మళ్లీ పాత సాగునీటి కష్టాలు మొదలయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలను కాపాడుకునేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, ఎల్లంపల్లి బరాజ్ మీదుగా వరద కాలువకు మళ్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి వద్ద ప్రస్తుతం 7 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని 15 టీఎంసీల నుంచి 4 టీఎంసీలను విడుదల చేయాలని కోరినప్పటికీ, ఇప్పటి వరకు నీటిని వదలలేదు.
సాగునీటి కోసం రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా కాలువను నింపితే తప్ప పంటలు పండటం కష్టమని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు. నీటి సరఫరా లేని కారణంగానే ఈసారి వరి నాట్లు వేయలేదని, వేసిన మక్కజొన్న, పసుపు పంటల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నామని స్థానిక రైతులు పేర్కొన్నారు.








