ఏఐ (AI) టూల్స్ వినియోగం పెరిగిన నేపథ్యంలో, ఏ కంపెనీలు నమ్మదగినవో తెలుసుకోవడానికి సైబర్ న్యూస్ ఒక పరిశోధన చేపట్టింది. ఈ అధ్యయనంలో భాగంగా డేటా ప్రైవసీ, పారదర్శకత, భద్రత, ప్రజాభిప్రాయం అనే నాలుగు కీలక విభాగాల్లో ఏఐ కంపెనీలను విశ్లేషించారు. ఇందులో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అత్యంత విశ్వసనీయమైన కంపెనీగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
గూగుల్ తన పనితీరుతో డేటా ప్రైవసీ, పారదర్శకత, భద్రత అనే మూడు విభాగాల్లో 100కి 100 పాయింట్లు సాధించింది. ప్రజాభిప్రాయం విభాగంలో కూడా 91 పాయింట్లు పొందింది. ఈ జాబితాలో రెండో స్థానంలో క్రిస్ప్, మూడో స్థానంలో ఫైర్ ఫ్లైస్ నిలిచాయి. అడోబ్, మాగ్నిఫిక్, రైట్ సోనిక్, వెరీఫఐ, సేల్స్ ఫోర్స్, గ్రామర్లీ, లవబుల్ వంటి కంపెనీలు కూడా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ప్రముఖ ఏఐ కంపెనీలైన ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ ఈ ర్యాంకింగ్స్‌లో వెనుకబడ్డాయి. ఓపెన్ఏఐ 22వ స్థానంలో నిలవగా, ఆంథ్రోపిక్ ఏఐ 70వ స్థానానికి పరిమితమైంది. ఆంథ్రోపిక్ ఏఐ సెక్యూరిటీపై దృష్టి పెడుతున్నప్పటికీ, మార్కెట్ ఒత్తిడి కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నా ఈ ర్యాంకింగ్ రావడం గమనార్హం. ఇతర ప్రముఖ కంపెనీల్లో మెటా 78వ స్థానంలో, చైనాకు చెందిన డీప్ సీక్ 283వ స్థానంలో నిలిచాయి.
పరిశోధనలో పాల్గొన్న 63 శాతం కంటే ఎక్కువ కంపెనీలు తమ ఏఐ మోడళ్లకు ఎలా శిక్షణ ఇస్తున్నాయో వెల్లడించడం లేదు. అలాగే 65 శాతం కంపెనీలు వినియోగదారుల డేటాను ఎంతకాలం నిల్వ ఉంచుతాయో చెప్పే నిర్దిష్ట కాలపరిమితిని పాటించడం లేదు. ఈ కారణాల వల్లే ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ వంటి కంపెనీలు విడుదల చేస్తున్న కొత్త టెక్నాలజీలపై ప్రజల్లో నమ్మకం బలపడటం లేదని నివేదిక పేర్కొంది.
సాంకేతికంగా ఎంత బలంగా ఉన్నా, అది ప్రజల్లో నమ్మకాన్ని పెంచలేదని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఏఐ కంపెనీలు తమ డేటా నిర్వహణ, పారదర్శకత విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ర్యాంకింగ్స్ సూచిస్తున్నాయి.








