ఏపీ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా దివ్యాంగుల కోసం సదరం (Sadarem) సేవలను 'మనమిత్ర' వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభించింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ఆధ్వర్యంలో ఈ సదుపాయాన్ని కల్పించారు. గతంలో సదరం సర్టిఫికెట్, స్లాట్ బుకింగ్ కోసం మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బందులకు ప్రభుత్వం స్వస్తి పలికింది.
ఈ సేవలను పొందేందుకు దివ్యాంగులు తమ మొబైల్ నుంచి 9552300009 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపాలి. అనంతరం 'Citizen Services' ఆప్షన్‌లోకి వెళ్లి 'Sadaram Services' ఎంచుకోవాలి. దీని ద్వారా స్లాట్ లభ్యతను చూసుకోవడంతో పాటు, తమకు అనుకూలమైన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ విధానం ద్వారా సర్టిఫికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ డిజిటల్ ప్రక్రియ వల్ల దరఖాస్తులు పారదర్శకంగా మారడమే కాకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణ ఇబ్బందులు పడే దివ్యాంగులకు ఈ కొత్త విధానం సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని దివ్యాంగులందరూ ఈ డిజిటల్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సూచించింది. ఒకే వేదికపై స్లాట్ బుకింగ్ నుంచి సర్టిఫికెట్ పొందే వరకు అన్ని వసతులు కల్పించడం ద్వారా దివ్యాంగులకు ఎంతో ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.







