తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత డీఎంకే పార్టీలో సంస్కరణలు మొదలయ్యాయి. చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలను ఆమోదించారు. పార్టీలోకి కొత్త రక్తాన్ని అంటే యువతను తీసుకువచ్చే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది.

కొత్త నిబంధనల ప్రకారం, బ్రాంచ్ పార్టీ సెక్రటరీ పదవికి 45 ఏళ్లు, మున్సిపల్, సిటీ, టౌన్ పంచాయతీల వార్డు కార్యదర్శులకు 50 ఏళ్లు గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు. టౌన్ పంచాయతీ, ఏరియా కమిటీ, సిటీ కమిటీ కార్యదర్శుల వయసు 60 ఏళ్లకు మించకూడదు. జిల్లా పార్టీ కార్యదర్శుల వయసు 70 ఏళ్లకు లోపు ఉండాలని నిబంధన విధించారు.

ఈ పదవుల్లో ఎవరైనా సరే గరిష్టంగా రెండు పర్యాయాలు మాత్రమే కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. పార్టీ ఎంపీ పి విల్సన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇవి పార్టీ సంక్షేమం కోసం తీసుకున్న చర్యలని, దీనివల్ల అందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు.

పార్టీ నిర్మాణంలో కూడా మార్పులు చేశారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఏరియా కమిటీకి సగటున 40,000 మంది ఓటర్లు ఉండేలా మార్పులు చేశారు. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రతి ఏరియా కమిటీ పరిధిలో సగటున 30,000 మంది ఓటర్లు ఉండేలా కొత్తగా వ్యవస్థను రూపొందించారు.