న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి భారీ నిరసనతో దద్దరిల్లింది. యూజీసీ చట్టంలోని ఈక్విటీ నిబంధనలు, రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ ఆధ్వర్యంలో ‘రిజర్వేషన్ రిఫార్మ్’ బ్యానర్ కింద శుక్రవారం జరిగిన ఈ నిరసనలో వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది పాల్గొన్నారు.
ఇప్పటివరకూ ఆన్‌లైన్ వేదికగా కొనసాగిన ఈ ప్రచారం, తాజాగా రోడ్లపైకి వచ్చి ప్రత్యక్ష ఆందోళన రూపం దాల్చింది. రిజర్వేషన్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని లేదా కేవలం ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే అమలు చేయాలని కొందరు ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మరికొందరు బ్యూరోక్రాటిక్ పరీక్షలు, ఉన్నత ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వాలు మతం, కులాలకంటే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాస్తవిక సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఆందోళనకు అభిషేక్ అగ్నిహోత్రి నాయకత్వం వహించగా, రాజస్థాన్‌కు చెందిన జనసేన, చాణక్య సేనతోపాటు కర్ణి సేన ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అజీత్ భారతి కూడా ఇందులో పాల్గొన్నారు.








