న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని పంపిణీదారులు మార్చి నెల నుంచి కొత్త గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడం లేదు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు విధించిన ఆంక్షలను ఇప్పటికే ఎత్తివేసినప్పటికీ, కొత్త కనెక్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిత్యావసర సేవలకు అంతరాయం కలగకుండా, ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు రీఫిల్ (సిలిండర్ నింపడం) చేయడానికి పంపిణీదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రభుత్వం తెలిపింది.
ఈ ఆంక్షలు తాత్కాలికమేనని, సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కొత్త కనెక్షన్లు యధావిధిగా ఇస్తామని కేంద్రం పేర్కొంది. ఫెడరేషన్ ఆఫ్ ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి పవన్ సోని మాట్లాడుతూ, గ్యాస్ సరఫరా గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కొత్త కనెక్షన్లు జారీ చేస్తామని చెప్పారు.
ఢిల్లీలోని ఒక్కో పంపిణీదారు వద్ద సగటున 100 నుండి 120 కొత్త కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలామంది వినియోగదారులు తాత్కాలికంగా ఫ్రీ ట్రేడ్ సిలిండర్ (ఎటువంటి అదనపు పత్రాలు లేకుండా కొనుగోలు చేసే గ్యాస్ సిలిండర్) తీసుకోవడానికి బదులుగా, కొత్త కనెక్షన్ కోసం వేచి చూస్తున్నారని పవన్ సోని వివరించారు.
కొత్త కనెక్షన్ కోసం వస్తున్న వారికి, ప్రస్తుతానికి ఐదు కేజీల ఫ్రీ ట్రేడ్ సిలిండర్లు లేదా పది కేజీల కాంపోజిట్ సిలిండర్లను (తక్కువ బరువు ఉండి, లోపల గ్యాస్ పరిమాణం కనిపించే సిలిండర్లు) వినియోగించుకోవాలని పంపిణీదారులు సూచిస్తున్నారు.








