బుల్లితెరపై ఆనందిగా గుర్తింపు పొందిన అవికా గోర్ ప్రస్తుతం అనారోగ్యంతో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గత ఐదు రోజులుగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షల్లో డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె భర్త మిలింద్ చంద్వానీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
అంత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పటికీ, అవికా తన షూటింగ్ పనులను ఆపలేదు. షూటింగ్ వాయిదా పడితే నిర్మాతలకు ఆర్థిక నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఆమె పనిని కొనసాగించారు. షూటింగ్ పూర్తి చేసిన తర్వాత, ఒక యాడ్ షూట్ కోసం ఆమె ఢిల్లీకి కూడా ప్రయాణించారు. అయితే జ్వరం, నీరసం తీవ్రం కావడంతో చివరకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అవికా నటించిన 'బుఖార్' అనే మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైన రోజే ఆమె నిజంగానే జ్వరంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రి బెడ్ నుంచే ఆమె తన పాట విడుదల గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్లేట్‌లెట్ కౌంట్ పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, డెంగ్యూ తీవ్రత గురించి ప్రస్తావిస్తూనే నవ్వుతూ విక్టరీ సింబల్ చూపించారు.
అవికా పని పట్ల చూపిస్తున్న అంకితభావాన్ని ఆమె భర్త మిలింద్ ప్రశంసించారు. ఇతరుల సమయం, డబ్బు వృథా కాకూడదనే ఆమె పట్టుదల తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు. 'బాలికా వధు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అవికా, త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.







