2027 ఐసీసీ మెన్స్ వన్డే ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్న దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా జట్లు టీ20 ముక్కోణపు సిరీస్‌లో తలపడటానికి సిద్ధమయ్యాయి. ఆగస్టు 28న నమీబియా రాజధాని విండ్‌హోక్‌లో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు.

24 ఏళ్ల విరామం తర్వాత వన్డే ప్రపంచ కప్ ఆఫ్రికా ఖండానికి తిరిగి వస్తుండటంతో ఈ సిరీస్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ తవేంగ్వా ముకుహ్లానీ మాట్లాడుతూ, 2027 నుంచి ప్రారంభించనున్న ఆఫ్రికా కప్‌కు ఈ సిరీస్ బలమైన పునాది వేస్తుందని తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెట్ సీఈఓ ఫోలెట్సి మోసెకి, నమీబియా సీఈఓ జోహాన్ ముల్లర్ ఈ టోర్నీ నిర్వహణపై హర్షం వ్యక్తం చేశారు.

ఆగస్టు 28న దక్షిణాఫ్రికా, నమీబియా మ్యాచ్‌తో సిరీస్ మొదలవుతుంది. ఆగస్టు 29న దక్షిణాఫ్రికా-జింబాబ్వే, ఆగస్టు 31న జింబాబ్వే-నమీబియా, సెప్టెంబర్ 1న జింబాబ్వే-దక్షిణాఫ్రికా, సెప్టెంబర్ 3న నమీబియా-జింబాబ్వే, సెప్టెంబర్ 4న నమీబియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 6న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఐసీసీ ఇప్పటికే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం మూడు దేశాల్లో 12 వేదికలను ఖరారు చేసింది. నమీబియాలో ఐసీసీ సీనియర్ ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం.