చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్ సమావేశ మందిరంలో చైర్మన్ శ్రీనివాసులు అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సీఈవో రవికుమార్ నాయుడు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ నాయుడు, జంగాలపల్లి శ్రీనివాసులు, కలికిరి మురళీమోహన్ హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే స్థానిక సంస్థల నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని, 15వ ఆర్థిక సంఘం చివరి విడత, 16వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులు అందలేదని చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్య ఆరోగ్య శాఖపై చర్చ జరుగుతున్న సమయంలో నగరి మండలం బీఎన్‌ఆర్‌పేటలో స్మశానం పక్కన విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మిస్తున్నారని ఒక సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్పందిస్తూ, గత ప్రభుత్వం ప్రజా సౌకర్యాలను విస్మరించి ఇష్టానుసారంగా భవనాలు నిర్మించిందని విమర్శించారు. ఈ నిర్మాణాలపై ప్రజాభిప్రాయ సేకరణకు కమిటీ వేస్తానని, దానికి అధ్యక్షుడిగా ఉండి నివేదిక ఇస్తానని ఆయన సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జడ్పీటీసీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన సీటు వద్దకు దూసుకెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది.

సభ్యుల మధ్య అరుపులు, కేకలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జోక్యం చేసుకుని అందరినీ శాంతింపజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.15 కోట్లతో 118 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు మంజూరు కాగా, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని కలెక్టర్ వివరించారు. మరోవైపు, వేరుశనగ విత్తనాల పంపిణీలో నాణ్యత లోపించిందని సభ్యులు ఆరోపించగా, ఫిర్యాదులు అందిన వెంటనే సరఫరాను నిలిపివేశామని వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు.

సమావేశం చివరలో చిత్తూరు ఎమ్మెల్యే జగన్ మోహన్ నాయుడు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. నిధుల మళ్లింపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని కోరగా, ఇప్పటికే ప్రారంభమైన పనులను రద్దు చేయకుండా చూడాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. చివరగా పలు అభివృద్ధి పనులపై తీర్మానాలను ఆమోదించడంతో సమావేశం ముగిసింది.