తెలంగాణ ఈగల్ ఫోర్స్, స్టేట్ టాస్క్‌ఫోర్స్ (STF), ఖమ్మం RNCC, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ గంజాయి రవాణా బయటపడింది. దాదాపు 18 గంటల పాటు నిఘా ఉంచిన పోలీసులు, చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారును అడ్డుకున్నారు. ఈ తనిఖీల్లో 20.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 10.25 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆగస్టు 26 రాత్రి ఒడిశా నుంచి గంజాయి వస్తోందన్న సమాచారంతో ఈగల్ ఫోర్స్ నిఘా మొదలుపెట్టింది. నిందితులు ప్రయాణిస్తున్న కారును విశాఖపట్నం నుంచి పోలీసులు ట్రాక్ చేశారు. ఆ కారు విశాఖలోని సబ్బవరం వద్ద ఏడు గంటల పాటు ఆగి, మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ వైపు బయలుదేరింది. ఖమ్మం–సూర్యాపేట మార్గంలో కారు అతివేగంగా వెళ్తుండటంతో, ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు వేచి చూశారు.
చివరకు పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారు వేగం తగ్గగానే పోలీసులు దాన్ని ఆపి, ఒడిశాకు చెందిన త్రిలోచన్ సామంత్ర, సాగర్ బాల్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు ఒడిశాలోని అమిత్ సాహానీ వద్ద రూ. 25 వేలకు ఈ గంజాయిని కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. హైదరాబాద్‌కు చెందిన బికాశ్ బారిక్ ఆదేశాల మేరకు తాము గంజాయిని తరలిస్తున్నామని నిందితులు అంగీకరించారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న అమిత్ సాహానీ, బికాశ్ బారిక్‌ల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బికాశ్ బారిక్‌ను గతంలో 2026 జూన్‌లో గచ్చిబౌలి పోలీసులు మాదకద్రవ్యాల నిరోధక చట్టం (NDPS) కింద అరెస్ట్ చేశారు. అలాగే, త్రిలోచన్‌పై ఒడిశాలో దొంగతనం, దోపిడీ, ఆయుధాల చట్టం కింద ఏడుకు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి గంజాయితో పాటు కారు, మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఈ అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్‌వర్క్‌లో ఉన్న మరికొందరి కోసం దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌కు సంబంధించి సమాచారం ఉన్నవారు ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 87126 71111కు తెలియజేయాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, తగిన రివార్డు కూడా ఇస్తామని వారు తెలిపారు.







