ప్రముఖ AI ప్లాట్‌ఫామ్ ChatGPTలో సాంకేతిక సమస్య తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని వినియోగదారులు ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ఉపయోగించలేకపోతున్నారు. ఈ ఫీచర్ ద్వారా బొమ్మలు, గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్ వంటివి సృష్టించే యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే, ChatGPTలోని ఇతర సేవలు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తున్నాయి. టెక్స్ట్ ఆధారిత సంభాషణలు మరియు ఇతర ఫీచర్లు సాధారణంగానే అందుబాటులో ఉన్నాయి. ఇమేజ్ జనరేషన్ ఫీచర్ నిలిచిపోయినట్లు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు రావడంతో, ఈ సమస్యపై యాజమాన్య సంస్థ OpenAI విచారణ చేపట్టింది.

ChatGPTలో ఇమేజ్ జనరేషన్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో ఒకటి. ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రతి వారం సుమారు 1.5 బిలియన్ల ఇమేజ్‌లు క్రియేట్ అవుతున్నాయి. ఈ ఫీచర్ ప్రారంభమైన తొలి వారంలోనే 130 మిలియన్ల మంది యూజర్లు 700 మిలియన్ల ఇమేజ్‌లను సృష్టించారు.

ప్రస్తుతం తలెత్తిన ఈ అంతరాయం తాత్కాలికమేనని OpenAI పేర్కొంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను మళ్లీ అందుబాటులోకి తెస్తామని, సేవలను పునరుద్ధరిస్తామని సంస్థ హామీ ఇచ్చింది.