హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై బాలరాజు, కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్ బాధితుల నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు స్టేషన్‌లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదు, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం, చార్జ్ షీట్ దాఖలు చేయడం వంటి ప్రతి పనికి కొందరు పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. స్టేషనరీ ఖర్చుల పేరుతో మొదలుకొని కోర్టు కానిస్టేబుల్ వరకు ప్రతి పనికి ఒక రేటును నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం.

కింది స్థాయి సిబ్బందితో డబ్బులు వసూలు చేయిస్తూ, మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్స్ చేయడం పరిపాటిగా మారిందని ఏసీబీ గుర్తించింది. ఇలాంటి అవినీతి చర్యల వల్ల నిజాయితీగా పనిచేసే పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటోంది.

ఏసీబీకి పట్టుబడుతున్నా, కేసులు నమోదై జైలుకు వెళ్తున్నా కొంతమంది పోలీసుల తీరు మారడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చడం, డబ్బులు ఇవ్వనిదే పనులు చేయకపోవడం వంటివి పెరిగిపోయాయని వారు చెబుతున్నారు.