సాధారణంగా చికెన్ షాపుల్లో వేడినీళ్లలో ముంచి ఈకలు తీసేస్తారు. కానీ నాటుకోడి రుచి, స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఈ పద్ధతిని పక్కన పెట్టాలి. ఈకలను మామూలుగా పీకిన తర్వాత, చికెన్‌కు పసుపు రాసి మంటపై కాల్చాలి. ఇలా చేయడం వల్ల చికెన్‌కు మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. చర్మంతో పాటు వండితే కూర మరింత కమ్మగా ఉంటుంది, ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిన్ లెస్ ముక్కలను తీసుకోవచ్చు.
శుభ్రం చేసిన చికెన్‌ను చిల్లుల గిన్నెలో వేసి 15 నిమిషాల పాటు నీరు పూర్తిగా దిగిపోయేలా చూడాలి. ఆ తర్వాత కిలో చికెన్‌కు అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, పావు కప్పు నూనె వేసి ముక్కలకు బాగా పట్టించాలి. నాటుకోడి అయితే గట్టిగా ఉంటుంది కాబట్టి, ప్రెషర్ కుక్కర్‌లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బ్రాయిలర్ చికెన్ అయితే సాధారణంగా వండుకుంటే సరిపోతుంది.
గ్రేవీ కోసం కడాయిలో నూనె వేసి దాల్చినచెక్క, లవంగాలు, ఇలాచీ, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించాలి. వీటికి జీడిపప్పు, గసగసాలు, టమాటాలు కలిపి మగ్గనిచ్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరో కడాయిలో నూనె వేసి మసాలా దినుసులు, కారం, ధనియా, జీరా పౌడర్లు వేయించి, సిద్ధం చేసుకున్న పేస్ట్‌ను కలపాలి. తక్కువ మంటపై రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత, 750 మి.లీ నీరు పోసి మరిగించాలి.
మరుగుతున్న గ్రేవీలో చికెన్ ముక్కలను వేసి, కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. తక్కువ మంటపై ఎనిమిది నిమిషాలు ఉడికించాక, నూనె పైకి తేలితే కూర సిద్ధమైనట్లు లెక్క. ఈ పద్ధతిలో వండిన నాటుకోడి కూరను బగారా రైస్, పులావ్ లేదా రాగి ముద్దతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.








