సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) నేత మరియు కేంద్రమంత్రి జయంత్ చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. జయంత్ చౌదరిని ఉద్దేశించి అఖిలేష్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని, అలాంటి ప్రకటనల ద్వారా అఖిలేష్ తన మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని ఓవైసీ విమర్శించారు.

తాను జయంత్ చౌదరిని ఇప్పటికీ కలుస్తుంటానని, ఆయన బీజేపీలో ఎందుకు చేరారని అడిగినప్పుడు ఆయన నవ్వుతూ తర్వాత మాట్లాడుకుందామని చెప్పారని ఓవైసీ గుర్తుచేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తాము జయంత్ చౌదరిని గౌరవిస్తామని, ఈ గౌరవం అఖిలేష్‌కు భయం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం తమకు ఇష్టం లేదని ఓవైసీ స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకోవాలని ఎవరికైనా ఉంటే, వారు తమతో మాట్లాడవచ్చని, కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఒక్కరే బీజేపీని ఓడించడం సాధ్యం కాదని అఖిలేష్ గుర్తించాలని ఆయన సూచించారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి గురించి కూడా ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎటువంటి కుటుంబ వారసత్వం లేకుండా సొంతంగా రాజకీయ ప్రస్థానాన్ని నిర్మించుకుని, స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాయకుల్లో మాయావతి ఒకరని ఆయన కొనియాడారు. ఆమె రాజకీయ ప్రస్థానాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని ఓవైసీ అభిప్రాయపడ్డారు.

అయితే, మాయావతి సాధించిన స్థాయి రాజకీయం మళ్లీ సాధ్యమవుతుందా లేదా అనేది వేరే విషయమని ఓవైసీ పేర్కొన్నారు. బీజేపీని ఓడించే లక్ష్యంతో ఇతర పార్టీలు తమతో చర్చలు జరుపుతాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.