హైదరాబాద్‌లోని అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారని హైదరాబాద్ సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హరీశ్‌రావు, కేటీఆర్, సుధీర్‌రెడ్డి, వివేకానంద, కమలాకర్, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డితో పాటు మరికొందరు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి ఆరోపణలతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి.

ఈ నెల 7న జరిగిన ఘటనలో ప్రజాప్రతినిధులు తమను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పోలీసు సిబ్బందిని భయపెట్టేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ దుస్తులు విప్పి మహిళా పోలీసుల సమీపానికి రావడంతో తాము తీవ్ర మానసిక ఒత్తిడికి, అసౌకర్యానికి గురయ్యామని బాధితురాలు వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సంగతి చూస్తామని వారు హెచ్చరించారని, ఈ ఘటనలో తాను గాయపడి వైద్య చికిత్స కూడా పొందానని ఆమె తెలిపారు.

మరోవైపు, అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్తున్న తమను గేటు వద్దే అడ్డుకోవడమే కాకుండా, వ్యూహాత్మకంగా మహిళా పోలీసులను పురుష ఎమ్మెల్యేలకు, పురుష పోలీసులను మహిళా ఎమ్మెల్యేలకు అడ్డంగా నిలబెట్టారని వారు పేర్కొన్నారు. తోపులాటలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే ప్రభుత్వం ఈ కేసులను నమోదు చేయించిందని, తమ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేయలేదని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఇదే సమయంలో, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ శాసనసభా పక్షం (BJLP) సమావేశం ఎటువంటి నిర్ణయం లేకుండానే ముగిసింది. 22ఏ భూముల సమస్యపై చర్చించాలని కొందరు, సెన్సస్-2027పై పట్టుబట్టాలని మరికొందరు ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సభలో చర్చలో పాల్గొనకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు వాదించగా, ప్రభుత్వం మైక్ ఇవ్వనప్పుడు చర్చలో పాల్గొని ప్రయోజనం లేదని మరికొందరు అభిప్రాయపడ్డారు.