సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి పెరిగినప్పటికీ, ఆ శక్తిని ఎక్కువ కాలం నిల్వ చేయడం ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా భూగర్భ సంపీడిత గాలి సాంకేతికతను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. అంటే, అధిక పీడనంతో గాలిని భూమి లోపలి రాళ్ల పొరల్లోకి పంపి నిల్వ చేయడం.

పోర్చుగల్‌లోని నోవా యూనివర్సిటీ లిస్బన్, యూనివర్సిటీ ఆఫ్‌ లిస్బన్ పరిశోధకులు ఈ విధానంపై అధ్యయనం చేస్తున్నారు. విద్యుత్తు అధికంగా ఉన్నప్పుడు ఆ శక్తితో గాలిని కంప్రెస్ చేసి (ఒత్తిడికి గురిచేసి) భూగర్భంలోకి పంపుతారు. అవసరమైనప్పుడు ఆ గాలిని బయటకు తీసి, దాని ఒత్తిడితో టర్బైన్లను తిప్పడం ద్వారా మళ్లీ విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు.

పరిశోధనా నమూనాల ప్రకారం, ఈ పద్ధతిలో శక్తి నిల్వ ఖర్చు కిలోవాట్-గంటకు 1 డాలర్ కంటే తక్కువగా ఉండవచ్చు. ఇది ప్రస్తుతం వాడుకలో ఉన్న బ్యాటరీల కంటే సుమారు 70 రెట్లు తక్కువ ఖర్చుతో కూడుకున్నదని విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం సైద్ధాంతిక అంచనా మాత్రమేనని, వాస్తవ వ్యయం తవ్వకాలు, పరికరాలు, నిర్వహణపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

అత్యంత అనుకూల పరిస్థితుల్లో 3,000 మీటర్ల లోతు వరకు ఉన్న భూగర్భ రిజర్వాయర్ 1 టెరావాట్-గంట (TWh) శక్తిని నిల్వ చేయగలదని అంచనా. ఇది గరిష్ఠ సామర్థ్యం మాత్రమేనని, రాళ్ల రంధ్రాలు, నీటి పరిస్థితులు, పీడనం వంటి అంశాలు వాస్తవ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయని నివేదిక పేర్కొంది.

అయితే, అన్ని ప్రాంతాల్లోని రాళ్ల పొరలు దీనికి అనుకూలం కావు. గాలి లీకేజీ కాకుండా చూడటం, పదేపదే పీడనం పెంచడం వల్ల రాళ్లపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం వంటి సవాళ్లు ఉన్నాయి. అందుకే ఈ సాంకేతికత ప్రస్తుతం పరిశోధన, మోడలింగ్ దశలోనే ఉంది.

భవిష్యత్తులో ఈ పద్ధతి విజయవంతమైతే, గంటల నుంచి రోజుల వరకు భారీ మొత్తంలో విద్యుత్తును నిల్వ చేయడానికి భూమి లోపలే ఒక అతిపెద్ద బ్యాటరీగా మారే అవకాశం ఉంది. పునరుత్పాదక విద్యుత్తులో వచ్చే హెచ్చుతగ్గులను సమతుల్యం చేయడానికి ఇది ఒక పరిష్కారంగా కనిపిస్తోంది.