బెంగాల్‌లో బీజేపీ గెలిచింది.. కానీ ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. టీఎంసీపై ఏ ఆరోపణలతో పోరాడి అధికారంలోకి వచ్చిందో.. అదే తరహా ఎక్స్‌టార్షన్, కట్‌మనీ, స్థానిక దందాల ఆరోపణలు ఇప్పుడు బీజేపీ నేతలపై వినిపిస్తున్నాయి. టీఎంసీని ఓడించిన బీజేపీ.. చివరకు టీఎంసీ రాజకీయ సంస్కృతినే మోస్తోందా? ఇదే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి అధికారం దక్కిన వేళ అది కేవలం ప్రభుత్వ మార్పు కాదు.. రాజకీయ సంస్కృతిలో మార్పునకు హామీగా కూడా ప్రచారం చేసుకుంది. 15 ఏళ్ల టీఎంసీ పాలనలో పాతుకుపోయాయని ఆరోపించిన సిండికేట్ వ్యవస్థ, టోల్‌బాజీ, కట్‌మనీ, స్థానిక రాజకీయ దళారీతనాన్ని అంతం చేస్తామని బీజేపీ ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఆ పార్టీకి మరో రకమైన పరీక్ష ఎదురవుతోంది. బీజేపీకి చెందిన కొందరు స్థానిక నాయకులు, కార్యకర్తలపై ఎక్స్‌టార్షన్, బెదిరింపులు, భూ-ఆస్తి వివాదాల్లో జోక్యం, నిర్మాణ రంగంలో డబ్బు డిమాండ్ వంటి ఆరోపణలు రావడం పార్టీ నాయకత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.
ఆరోపణలు ఇవే.. ఆగస్టు 14న తుఫాన్‌గంజ్ మండల కమిటీ నంబర్ 4 ఉపాధ్యక్షుడు బిశ్వజిత్ తాలూక్దార్‌ను స్థానిక వ్యాపారవేత్త కుమారుడిని అపహరించి, దాడి చేసి ఎక్స్‌టార్షన్ డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఆగస్టు 9న సౌత్ దమ్‌దమ్‌లో ఓ ప్రొమోటర్.. టీఎంసీ నుంచి బీజేపీలోకి మారిన కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి, నిర్మాణ ప్రాజెక్టు కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. బ్యాంకురాలోని విష్ణుపూర్‌లో ఓ ప్రొమోటర్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలపై నలుగురు బీజేపీ కార్యకర్తల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యాయి. వారిని అరెస్టు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. వెస్ట్ బర్ధమాన్‌లోని జమూరియాలో ఇసుక లారీల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేత రాకేశ్ మాజి అరెస్టయ్యారు. ఇలాంటి ఆరోపణలు వరుసగా తెరపైకి రావడం బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.
ఎందుకంటే.. ఇదే ఆరోపణలను బీజేపీ గతంలో టీఎంసీపై చేసింది. టీఎంసీ పాలనలో స్థానిక రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, సిండికేట్ నిర్వాహకులు ప్రభుత్వ వ్యవస్థకు సమాంతరంగా ప్రభావం చూపుతున్నారని బీజేపీ విమర్శించింది. కట్‌మనీ, టోల్‌బాజీ, రాజకీయ అండతో అక్రమ కార్యకలాపాలకు తెరదించుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అదే తరహా ఆరోపణలు తన కార్యకర్తలపై వస్తే సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడే అసలు రాజకీయ కథ మొదలవుతుంది. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 15 ఏళ్లుగా గ్రామస్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు విస్తృతమైన రాజకీయ నెట్‌వర్క్ నిర్మించుకుంది. బీజేపీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించినప్పటికీ.. ప్రతి గ్రామంలో, ప్రతి బూత్‌లో అదే స్థాయిలో బలమైన సంస్థాగత నిర్మాణం ఉందా? అన్నది ప్రశ్న.
బీజేపీ సీరియస్.. అయితే, ఈ విషయంలో బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆగస్టు 10న ఎక్స్‌టార్షన్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో 25 మంది కార్యకర్తలను సస్పెండ్ చేసి, సుమారు 300 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పీటీఐ నివేదించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య కూడా ఎక్స్‌టార్షన్ పూర్తిగా నిర్మూలించామని చెబితే అది అబద్ధమవుతుందని అంగీకరించారు. సులభంగా డబ్బు సంపాదించే అలవాటు ఉన్న కొందరు వ్యక్తులు బీజేపీలోకి వచ్చారని, అలాంటి ధోరణులను నియంత్రించేందుకు పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆగస్టు 18న జరిగిన సంస్థాగత శిక్షణ కార్యక్రమంలో కూడా భట్టాచార్య పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్లాట్లు కొలవడం, దుకాణాలు లేదా ఇళ్లు మూయించడం, స్థానిక వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు బీజేపీకి, టీఎంసీకి తేడా కనిపించదని హెచ్చరించారు.








