బాపట్ల జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచే సమయానికి ముందే, అనధికారిక బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు పూర్తవుతున్నాయి. ఎక్సైజ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమ వ్యాపారం విస్తరించింది. ముఖ్యంగా కారంచేడు, కర్లపాలెం, ఎం.వి.రాజుపాలెం, కొల్లూరు, భట్టిప్రోలు, పిట్టలవానిపాలెం, పర్చూరు మండలాల్లోని గ్రామాల్లో కిరాణా కొట్లు, చికెన్ సెంటర్ల మాటున మద్యం సీసాలు అమ్ముతున్నారు.
జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న ధాబాలు, హోటళ్లలో రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం దందా సాగుతోంది. నిబంధనల ప్రకారం హైవేలకు దూరంగా ఉండాల్సిన విక్రయాలు రోడ్లపైనే జరుగుతుండటంతో, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు చీరాల సమీపంలోని రిసార్టులను కేంద్రంగా చేసుకుని గోవా నుంచి అక్రమంగా తరలించిన మద్యం తక్కువ ధరకే సరఫరా అవుతోంది.
మద్యం ధరల విషయంలోనూ వినియోగదారులను నిర్వాహకులు దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ప్రతి సీసాపై రూ. 10 నుంచి రూ. 30 వరకు, కొన్ని చోట్ల రూ. 50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ అదనపు వసూళ్ల వెనుక ఎక్సైజ్ అధికారుల హస్తం ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు.
చీరాలలోని ఓడరేవు, రామాపురం బీచ్, బాపట్ల మండలంలోని స్టువార్టుపురం ప్రాంతాలు నాటుసారా తయారీకి అడ్డాగా మారాయి.







