ఢిల్లీలోని సౌత్ ఆసియా క్లబ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా షేక్ హసీనా ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రభుత్వం మారిన తర్వాత భారత్‌తో ఆ దేశ సంబంధాలు దెబ్బతిన్నాయని ఆమె విమర్శించారు. ప్రస్తుత పాలకులు దేశాన్ని ఆర్థికంగా దిగజార్చారని, జీడీపీ మందగించి ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజలు పేదరికంతో అల్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
హసీనా కుమారుడు, ఆమె వ్యక్తిగత సలహాదారు సజీబ్ వాజేద్ జాయ్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ఇప్పుడు మరో పాకిస్థాన్‌లా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మద్ యూనుస్ పాలనలో రాజకీయ హత్యలు పెరిగాయని, ఆగస్టు 5, 2024 తర్వాత పోలీస్ కస్టడీ మరణాలు అధికమయ్యాయని ఆయన ఆరోపించారు. 2024 జులై, ఆగస్టు నిరసనల సమయంలో 1400 మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతుంటే, ప్రభుత్వం మాత్రం 800 మంది అని తప్పుగా పేర్కొంటోందని ఆయన ప్రశ్నించారు.
తమ పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులతో పాటు జర్నలిస్టులు, లాయర్లు, జడ్జీలు, మైనారిటీలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని హసీనా ఆరోపించారు. 2024 నుంచి వేల మందిని అరెస్టు చేశారని ఆమె తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేశంలో శాంతిని, భద్రతను తిరిగి నెలకొల్పేందుకు తాను స్వదేశానికి వెళ్లాల్సి ఉందని ఆమె చెప్పారు.
తనపై కేసులు ఉన్నాయని, వెళ్తే చంపేస్తారని తెలిసినా వెనక్కి తగ్గనని హసీనా స్పష్టం చేశారు. అధికారం కోసం కాకుండా, ప్రజల శ్రేయస్సు కోసం తాను తిరిగి వెళ్తున్నానని ఆమె తెలిపారు. జైలుకు పంపినా లేదా ప్రాణాపాయం ఎదురైనా సరే, బంగ్లాదేశ్ వెళ్లడమే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు.







