2027లో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన అయోధ్య అసెంబ్లీ స్థానానికి పవన్ పాండేను అభ్యర్థిగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం ప్రకటించారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బ్రహ్మణ సదస్సులో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పవన్ పాండే అయోధ్య నుంచి విజయం సాధిస్తారని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు.

రామ మందిరం ఉన్న అయోధ్య నియోజకవర్గం రాజకీయంగా, మతపరంగా భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ అభ్యర్థిని ప్రకటించడం ద్వారా బీజేపీకి ఎస్పీ సవాల్ విసిరింది. అయోధ్య జిల్లాలో దరియాబాద్, రుదౌలి, మిల్కిపూర్, బికాపూర్ మరియు అయోధ్య అనే ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన పవన్ పాండే 1998లో ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. సమాజ్‌వాదీ ఉద్యమ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో పరిచయం ఉన్న ఆయన, 1999 నుంచి అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితంగా ఉంటున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత లల్లూ సింగ్‌ను ఓడించిన చరిత్ర ఆయనకు ఉంది. దూకుడుగా వ్యవహరించే పవన్ పాండే, ఇటీవల శ్రీ రామ్ జన్మభూమి ఆలయ విరాళాలు, కానుకల వివాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ట్రస్ట్ పనితీరును సమీక్షించి, పారదర్శకతను నిర్ధారించాలని ఆయన కోరుతున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పే పవన్ పాండేను బరిలోకి దింపడం ద్వారా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని ఎస్పీ భావిస్తోంది.