మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో మంగళవారం జరిగిన తొలి పోరులో ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేసిన జట్టు వన్డేలో మాత్రం తడబడింది. బ్యాటింగ్ వైఫల్యమే తమ పరాజయానికి మూలకారణమని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మ్యాచ్ అనంతరం స్పష్టం చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జోరూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అర్ధ శతకాలు సాధించినా, మధ్య ఓవర్లలో 20 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడం జట్టుకు భారీ దెబ్బ తగిలింది. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా, శివమ్ దూబెల్ తలా ఒక వికెట్ సాధించారు.

259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్), అక్షర్ పటేల్ (53 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్ధ శతకాలు బాదడంతో పాటు శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్, సామ్ కరన్ ఇంగ్లాండ్ తరఫున తలా ఒక వికెట్ తీశారు.

ఓటమిపై స్పందించిన హ్యారీ బ్రూక్, మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోవడం సమంజసం కాదని, దీంతో జట్టు ఒత్తిడిలో పడిపోయిందని అన్నాడు. అయితే ఆటగాళ్లు పుంజుకుని పోరాడటం, జోరూట్-డాసన్ భాగస్వామ్యం కీలకంగా మారడం ఆశాజనకమని పేర్కొన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మారిపోయిందని, బ్యాటర్లు ఈజీగా పరుగులు చేసేలా ఉండటంతో ప్రత్యర్థి స్వేచ్ఛగా ఆడిందని విశ్లేషించాడు. తమ బ్యాటర్లు మరికొన్ని పరుగులు చేసి ఉంటే స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టడి చేసేవారని అభిప్రాయపడ్డాడు.

రెండో వన్డే కోసం జట్టు కాంబినేషన్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హ్యారీ బ్రూక్ తెలిపాడు. కార్డిఫ్‌కు వెళ్లి అక్కడి పిచ్ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పాడు.