క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నుంచి అనయా బంగర్‌కు కమ్యూనిటీ స్థాయిలో మహిళల క్రికెట్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది ప్రొఫెషనల్ లేదా ఎలైట్ స్థాయి క్రికెట్ కాకపోయినప్పటికీ, ఆమె కెరీర్‌లో ఇది చాలా కీలకమైన మలుపు.
ఈ ఏడాది ప్రారంభంలో థాయిలాండ్‌లో లింగ మార్పు శస్త్రచికిత్స (Vaginoplasty) చేయించుకున్న అనయా, ప్రస్తుతం ఆ గాయాల నుంచి కోలుకుంటూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టింది. తాను మళ్లీ క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెడతానని అస్సలు అనుకోలేదని, తన ఆశలు చచ్చిపోయిన సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా రెండో అవకాశం ఇచ్చిందని ఆమె భావోద్వేగంతో తెలిపింది.
గతంలో ఆర్యన్ అనే పేరుతో ముంబై అండర్-19 జట్టు తరపున సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి అనయా క్రికెట్ ఆడింది. లింగ మార్పు తర్వాత తన మెడికల్ రిపోర్ట్స్‌ను బీసీసీఐ (BCCI) కి పంపినా, భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే, సమన్యాయం మరియు కలుపుగోలుతనం ప్రాతిపదికన క్రికెట్ ఆస్ట్రేలియా ఆమె మెడికల్ హిస్టరీని పరిశీలించి ఈ అనుమతి ఇచ్చింది.
ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ ఆడుతూనే, భవిష్యత్తులో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) వంటి ఎలైట్ టోర్నీల్లో ఆడాలని అనయా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిబంధనల ప్రకారం పురుషుల యుక్తవయస్సును దాటిన ట్రాన్స్‌జెండర్లు మహిళల క్రికెట్ ఆడటంపై నిషేధం ఉంది.
ఎలైట్ స్థాయి క్రికెట్ ఆడాలంటే ఆమె మరికొన్ని పరీక్షలను దాటాల్సి ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం, కనీసం 12 నెలల పాటు రక్తంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు 10 nmol/L కంటే తక్కువగా ఉండాలి. మార్చి 2027 నాటికి ఈ స్థాయిలను బ్లడ్ టెస్టుల ద్వారా నిరూపించుకుంటేనే ఆమె ఎలైట్ క్రికెట్‌కు అర్హత సాధిస్తుందని బోర్డు స్పష్టం చేసింది.








