రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ షా స్టేడియంలో బుధవారం జరిగిన మూడో యూత్‌ వన్డేలో ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టు 49.3 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టులో జెడ్‌ హాలిక్‌ 87 పరుగులతో రాణించగా, నీల్‌ పటేల్‌ 51 పరుగులు చేశారు. మిగిలిన వారిలో బ్లేక్‌ కాటిల్‌ 38 పరుగులు మాత్రమే చేయగలిగారు.

భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో ఆసీస్‌ బ్యాటర్లు పెద్దగా స్కోరు చేయలేకపోయారు. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న భారత యువ జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది.

లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు లక్ష్య రాయ్‌చందాని, ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరు తొలి వికెట్‌కు 47 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ బౌండరీలతో అలరించారు.

భారత ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో ఆసీస్‌ బౌలర్ జేకబ్‌ పీట్జ్‌ బౌలింగ్‌లో ఆర్యవీర్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. మాథ్యూ లాఫ్‌ పట్టిన ఈ క్యాచ్‌తో భారత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. మొత్తం 31 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్‌, ఐదు ఫోర్ల సాయంతో 34 పరుగులు చేశారు.

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్‌ సెహ్వాగ్‌ పెద్ద కుమారుడైన ఆర్యవీర్‌, ఈ సిరీస్‌తోనే భారత యువ జట్టుకు ఎంపికయ్యారు. తొలి మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన ఆయన, రెండో వన్డేలో 47 పరుగుల వద్ద అర్ధ శతకాన్ని చేజార్చుకున్నారు. తాజాగా మూడో మ్యాచ్‌లోనూ హాఫ్‌ సెంచరీకి చేరువలో ఆగిపోయారు.