పిల్ల జమిందార్, భీమిలి కబడ్డీ, జగడం వంటి సినిమాలతో గుర్తింపు పొందిన కమెడియన్ ధన్‌రాజ్, తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఒక ఇంటర్వ్యూలో వివరించారు. పెళ్లయిన కొత్తలో కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారిందని ఆయన చెప్పారు.

ఆ సమయంలో జగడం సినిమా షూటింగ్ జరుగుతుండగా, హీరో రామ్ దగ్గరకు వెళ్లి ధన్‌రాజ్ సాయం కోరారు. వెంటనే రామ్ 10 వేల రూపాయల చెక్ రాసి ఇచ్చి, భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా సిగ్గుపడకుండా అడగమని ధైర్యం చెప్పారు. ఆ రోజుల్లో ఆ 10 వేల రూపాయలు తనకు 10 లక్షలతో సమానమని ధన్‌రాజ్ గుర్తు చేసుకున్నారు.

అంతేకాదు, దర్శకుడు సుకుమార్ కూడా తనకు ఆర్థికంగా ఎంతో అండగా నిలిచారని ధన్‌రాజ్ తెలిపారు. ప్రసాద్ లాబ్స్ వద్ద కలిసినప్పుడు, తన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న సుకుమార్, జేబులో ఉన్న డబ్బును లెక్కపెట్టకుండా ఇచ్చి ఇంట్లో అవసరాలకు వాడుకోమని చెప్పారు.

తాను అప్పట్లో పెద్ద స్టార్ కూడా కాకపోయినా, వారు చూపించిన ప్రేమకు తాను ఆశ్చర్యపోయానని ధన్‌రాజ్ ఎమోషనల్ అయ్యారు. వారిద్దరి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే, తనకు కొడుకు పుట్టిన 21 రోజుల తర్వాత సుకుమార్, రామ్ పేర్లను కలిపి 'సుఖ్ రామ్' అని పేరు పెట్టారు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా టీమ్ లీడర్‌గా ఎదిగిన ధన్‌రాజ్, ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే దర్శకుడిగానూ ప్రయత్నాలు చేస్తున్నారు. సముద్ర ఖని ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన 'రామం రాఘవం' సినిమా కమర్షియల్‌గా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, కంటెంట్ పరంగా మంచి ప్రశంసలు అందుకుంది.