అమెరికా ఎయిర్ ఫోర్స్, స్పేస్ ఫోర్స్ (అంతరిక్ష రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక మిలిటరీ విభాగం) కార్యకలాపాలను పర్యవేక్షించే ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మీంక్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ప్రతికూల చర్యల నుంచి జాయింట్ ఫోర్స్ (అమెరికాకు చెందిన వివిధ రక్షణ దళాల సమూహం)ను రక్షించగల అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ ఆయుధాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి లేదా వాటి ప్రత్యేకతలు ఏమిటనే వివరాలను మీంక్ బయటపెట్టలేదు. ఈ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగానే వెల్లడించినట్లు సమాచారం. ఈ ఆయుధాలు అంతరిక్షం ద్వారా జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించడానికి రూపొందించినవని ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి TechCrunch అనే వార్తా సంస్థకు తెలిపారు.
ఈ ఆయుధాలను ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందనే ప్రశ్నకు, 2007 నుంచి రష్యా, చైనాలు అంతరిక్షంలో ఆయుధ పరీక్షలు చేస్తున్నాయని అమెరికా అధికారులు గుర్తుచేశారు. అంతరిక్షం ఇప్పుడు యుద్ధ రంగంగా మారిందని, జాతీయ భద్రత కోసం అంతరిక్ష నియంత్రణ తప్పనిసరి అని వారు స్పష్టం చేశారు. అందుకే స్పేస్ ఫోర్స్‌ను ఆరో మిలిటరీ విభాగంగా అమెరికా ఏర్పాటు చేసింది.
చైనా ఇప్పటికే ఇతర ఉపగ్రహాలను దెబ్బతీయగల సామర్థ్యం ఉన్న అంతరిక్ష నౌకలను నడుపుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అంతేకాకుండా, అణ్వాయుధాన్ని మోసుకెళ్లగల ఉపగ్రహాన్ని రష్యా అభివృద్ధి చేస్తోందని అమెరికా స్పేస్ ఫోర్స్ చెబుతోంది. ఇలాంటి ఆయుధాల వల్ల అంతరిక్షంలో వ్యోమగాములకు, ఇతర వస్తువులకు ప్రమాదకరమైన శకలాలు ఏర్పడతాయని, అందుకే ఉపగ్రహాలను ధ్వంసం చేసే పద్ధతులకు అమెరికా ఎంతోకాలంగా వ్యతిరేకమని ది టైమ్స్ పేర్కొంది.
బహిరంగంగా ఈ విషయాలను వెల్లడించడం ద్వారా శత్రు దేశాలు తప్పుడు అంచనాలు వేయకుండా నిరోధించవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ ప్రకటన ద్వారా అంతరిక్ష కార్యకలాపాలను సాధారణీకరించడంతో పాటు, తమ రక్షణ సామర్థ్యాన్ని బలపరుచుకోవాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది.








