కర్ణాటక రాష్ట్ర ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన Amazon, Swiggy Instamart, BigBasket ల ఆహార లైసెన్సులను, రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. ఈ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విషపూరితమైన ఉమ్మెత్త పండ్లు, వాటి విత్తనాలను ఆహార ఉత్పత్తులుగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఆహార భద్రత అధికారులు జరిపిన దర్యాప్తులో ఈ సంస్థల గిడ్డంగుల్లో నిల్వ ఉన్న ఉమ్మెత్త పండ్లను ప్యాక్ చేసి, వినియోగదారులకు నేరుగా డెలివరీ చేస్తున్నట్లు వెల్లడైంది. ఆహార ఉత్పత్తుల నాణ్యతను పర్యవేక్షించే భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) జారీ చేసిన లైసెన్స్ నంబర్లను ఉపయోగించి ఈ విక్రయాలు సాగించడం గమనార్హం.
ఉమ్మెత్త పండ్లు, విత్తనాలు అత్యంత విషపూరితమైనవని, వీటిని తీసుకోవడం వల్ల మనుషులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ కారణంగానే ఆన్‌లైన్ వేదికలపై వీటిని ఆహారంగా విక్రయించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ పండ్లకు సంబంధించిన అన్ని ప్రకటనలను, ఆన్‌లైన్ లిస్టింగ్‌లను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను అధికారులు ఆదేశించారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్పత్తులను ఆహారంగా విక్రయించినా లేదా పంపిణీ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈ లైసెన్స్ రద్దు శాశ్వతమైనది కాదని వారు వివరించారు. సదరు కంపెనీలు తమ వివరణను నివేదికల రూపంలో సమర్పించిన తర్వాత, అధికారులు విచారణ జరిపి తదుపరి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ వివరణను అధికారులకు అందజేసినట్లు సమాచారం.








