రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మరో విడత భూసమీకరణ ప్రక్రియ మొదలైంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో 1,654.259 ఎకరాల పట్టా భూమిని సేకరించాలని క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) నిర్ణయించింది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

మోతడక గ్రామంలో మొత్తం 2,344.12 ఎకరాల భూమి ఉండగా, అందులో పట్టా భూమిని మాత్రమే ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తున్నారు. మిగిలిన భూమి ప్రభుత్వానికి చెందినదని సీఆర్డీఏ స్పష్టం చేసింది. సమీకరించిన ఈ భూములను ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణానికి వినియోగించనున్నారు.

భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భూసేకరణ చేపడుతున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. ఇప్పటికే అమరావతిలోని పలు ప్రాంతాల్లో భూసమీకరణ కొనసాగుతుండగా, తాజా నోటిఫికేషన్‌తో రవాణా మౌలిక వసతుల అభివృద్ధికి మరింత వేగం లభించనుంది.

మరోవైపు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 596 కోట్ల రూపాయలతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, 1,430 కోట్ల రూపాయలతో క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే అత్యవసర మౌలిక వసతుల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు లభించాయి.

ఈ సమావేశంలో రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో లేఅవుట్ రోడ్లను బీటీ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం తెలిపారు. అలాగే, అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు అందించే ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.