గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు తగ్గడంతో పాటు హిందీలోనూ వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న పూజా హెగ్డే మళ్లీ బిజీ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ సరసన 'శ్రీ శ్రీ' సినిమాలో మాత్రమే ఆమె నటిస్తోంది. అయితే, ఇప్పుడు ఆమెకు బ్యాక్ టు బ్యాక్ రెండు కొత్త అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తోంది.
అందులో ఒకటి అల్లు అర్జున్ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను చిత్ర బృందం పరిశీలిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'అల వైకుంఠపురములో..', 'డీజే: దువ్వాడం జగన్నాథం' సినిమాలు వచ్చాయి.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న 'కూలీ' చిత్రంలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మళ్లీ హిట్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు, రవితేజ మరియు శ్రీ విష్ణు హీరోలుగా హసిత్ గోలి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ సినిమాలో కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే, విజయ్ హీరోగా నటించిన 'జన నాయకుడు' సినిమాతో పూజా హెగ్డే గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.








