బ్యాంక్ ఖాతాలు తెరవడం లేదా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రతిసారీ కేవైసీ (KYC) పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఇక ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) సంయుక్తంగా CKYC 2.0 వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నాయి.
ఈ కొత్త విధానం ఆగస్టు నుంచి బ్యాంకులు, బీమా కంపెనీలతో ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరి నాటికి మ్యూచువల్ ఫండ్స్, బ్రోకరేజ్ సంస్థలు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం కానున్నాయి. వినియోగదారులు ఒక్కసారి అనుమతి ఇస్తే చాలు, ఆర్థిక సంస్థలు కేంద్ర రిజిస్ట్రీ నుండి మీ వివరాలను నేరుగా పొందుతాయి.
ప్రస్తుతం దేశంలో సుమారు 120 కోట్ల రికార్డులతో ఉన్న కేంద్ర కేవైసీ రిజిస్ట్రీలో నకిలీ నమోదులు, డేటా నాణ్యత వంటి సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు CKYC 2.0లో ప్రతి రికార్డుకు ఒక 'కాన్ఫిడెన్స్ స్కోర్' కేటాయిస్తారు. ఇది ఆ సమాచారం ఎంత నమ్మదగినదో తెలియజేస్తుంది.
వినియోగదారుల భద్రత కోసం, వారి డేటాను ఏ సంస్థ యాక్సెస్ చేయాలన్నా ఓటీపీ (OTP) ఆధారిత అనుమతి తప్పనిసరి. ఈ వ్యవస్థ వల్ల నకిలీ గుర్తింపులు, ఆర్థిక మోసాల ప్రమాదం తగ్గడమే కాకుండా, సేవలు మరింత వేగంగా, సౌకర్యవంతంగా అందుబాటులోకి వస్తాయి.








