రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్, ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

సినిమా విడుదల నేపథ్యంలో టికెట్ బుకింగ్స్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు 21 నుంచి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ బుకింగ్‌లు అందుబాటులోకి వస్తాయని సినిమా వర్గాలు తెలిపాయి. దీనిపై దర్శక నిర్మాతలు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.

మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో యశ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించగా, నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా వంటి తారలు కీలక పాత్రల్లో కనిపిస్తారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీతో పాటు పలువురు విదేశీ నటీనటులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చి, ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందించగా, కొన్ని పాటలకు విశాల్ కూడా బాణీలు సమకూర్చారు. సినిమాలో యశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్లు వేగంగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. యశ్ స్వయంగా నేషనల్ మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.