విశాల్ తన మొదటి దర్శకత్వ సినిమా 'మకుటం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ నటిస్తున్నారు. స్వర్గీయ ఆర్‌బీ చౌదరి నిర్మించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటివరకు టీజర్ మరియు 'ది రైజ్ అఫ్ లింగా' పాట పెద్ద రెస్పాన్స్ పొందింది.
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో విశాల్ భావోద్వేగంతో మాట్లాడుతూ, రామ్ గోపాల్ వర్మ గారి 'శివ' సినిమా చూసినప్పుడే దర్శకుడిని అవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇప్పుడు ఆ కల నెరవేరిందని గర్వంగా పేర్కొన్నారు. ఆర్‌బీ చౌదరి గారిని చాలా మిస్ అవుతున్నానని, ఆయన బ్యానర్ నుంచి పరిచయమైన దర్శకుల్లో తాను 45వ వాడనని గుర్తు చేశారు.
ఈ సినిమా కోసం ఒక్క ఏడాది పాటు రాత్రింబవళ్లు కష్టపడ్డానని, వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టానని విశాల్ అన్నారు. సాయి ధన్సిక అతనికి పెద్ద అండగా నిలిచారని, జీవీ ప్రకాష్ లింగా పాటలో తనను పాడించి పెద్ద రిస్క్ తీసుకున్నారని నవ్వుతూ చెప్పారు. 'నచ్చాకే వచ్చేరా' పాటను ప్రభ అద్భుతంగా పాడారని కృతజ్ఞతలు తెలిపారు.
తన 22 ఏళ్ల నటనా ప్రయాణంలో 35 సినిమాలు చేశానని, తండ్రి జీకే రెడ్డి గారు పట్టుబట్టి 'పందెంకోడి'ని తెలుగులో రిలీజ్ చేయకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదని గుర్తు చేశారు. నటుడిగా ప్రేక్షకులు ఆదరించినట్లే, ఈ కొత్త ప్రయత్నాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నానని విశాల్ చెప్పారు. సినిమా గురించి ఎక్కువ చెప్పను, థియేటర్లలో మీరే చూసి మాట్లాడతారని ముగించారు.





