ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం భీమవరం వెళ్లనున్నారు. అడ్డగోలు మేత ధరల పెంపు, పతనమవుతున్న గిట్టుబాటు ధరలు, విద్యుత్ చార్జీల భారంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచి భరోసా ఇవ్వడానికి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

తాడేపల్లి నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరిన వైఎస్ జగన్, 10 గంటలకు భీమవరంలోని లూథరన్ హైస్కూల్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.30 గంటలకు ఉండి రోడ్డులో జరిగే సభలో రైతులతో మాట్లాడతారు. మేత ధరలు, రొయ్యలు, చేపల గిట్టుబాటు ధరలు, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, ఫీడ్ కంపెనీల ధరల పెంపు వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో చర్చించనున్నారు.

గత కొన్ని నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతులు నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా రైతులకు మద్దతుగా ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల రైతులు క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఈ సభకు తరలిరానున్నారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావుతో పాటు పార్టీ నేతలు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.