సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని ఢీకొట్టి డైనోసార్ల జాతిని అంతం చేసిన గ్రహశకలం మూలాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, పారిస్, బ్రస్సెల్స్ మరియు వియన్నాకు చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలను 'సైన్స్ అడ్వాన్సెస్' పత్రికలో ప్రచురించారు.
మెక్సికోలోని యుకాటన్ తీరంలో ఏర్పడిన 'చిక్సులబ్' బిలం వద్ద సేకరించిన మట్టి పొరలను పరిశోధకులు విశ్లేషించారు. అందులోని నికెల్ ఐసోటోప్‌లను పరీక్షించగా, ఆ గ్రహశకలం సౌర వ్యవస్థలోనే అత్యంత పురాతనమైన, అరుదైన 'CO కాండ్రైట్' రకానికి చెందినదని తేలింది. భూమిపై లభించే గ్రహశకలాల అవశేషాలలో ఈ రకానికి చెందినవి కేవలం 5 శాతం మాత్రమే ఉండటం విశేషం.
సుమారు 10 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ అంతరిక్ష శిల భూమిని ఢీకొట్టడంతో అప్పట్లో 75 శాతం జీవజాతులు అంతరించిపోయాయి. ఈ ఘాతంతో భారీ భూకంపాలు, సునామీలు సంభవించాయి. వాతావరణంలోకి చేరిన ధూళి కణాలు సూర్యకాంతిని కొన్నేళ్ల పాటు అడ్డుకోవడంతో భూమిపై జీవరాశి మనుగడ కష్టమైంది.
ఈ గ్రహశకలం గురు గ్రహం సమీపంలోని బయటి ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి లేదా సౌర వ్యవస్థ చివరి సరిహద్దుల నుంచి వచ్చి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. విశ్వంలోనే అత్యంత అరుదైన గ్రహశకలం భూమిని ఢీకొట్టడం డైనోసార్ల దురదృష్టమని పరిశోధకులు పేర్కొన్నారు.








