వాషింగ్టన్ : యుద్ధం శాశ్వతంగా ముగిసిన తర్వాత శాంతి కొనసాగాలంటే అమెరికాను ఇరాన్ గౌరవించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరుచుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మళ్లీ ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. “భయం అనే పదాన్ని ఉపయోగించాలనుకోవడం లేదు. కానీ ఇరాన్ అమెరికాను గౌరవిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు” అని పేర్కొన్నారు.
యుద్ధం ముగిసిన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతినిధి వర్గం తరఫున సోమవారం చర్చల్లో పాల్గొన్న ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ హార్జుజ్ జలసంధిని ఇరాన్ అజమాయిషీ చేస్తుందని , తాము ఈ విషయంలో మళ్లీ క్రియాశీలకంగా ఉంటామని వెల్లడించడాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఇరాన్‌కు చురకలు అంటించారు.








