హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే వైన్ తయారు చేస్తున్న ఆంటోనీ పీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో భాగంగా సుమారు రూ.1.50 లక్షల విలువైన 377 లీటర్ల వైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంటోనీ పండ్లతో సహజ పద్ధతిలో వైన్ తయారీ వీడియోలు చూసి, మార్కెట్ నుంచి పండ్లు తెప్పించి ఈ పని మొదలుపెట్టాడు. మొదట్లో స్నేహితులకు రుచి చూపించగా, వారి ప్రశంసలతో ధైర్యం వచ్చి దీనిని పూర్తి స్థాయి వ్యాపారంగా మార్చుకున్నాడు.
కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు ఏకంగా ఏడు రకాల ఫ్రూట్ వైన్‌లు తయారు చేసి, సోషల్ మీడియా ద్వారా డోర్ డెలివరీ కూడా ప్రారంభించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఆరు నుంచి ఏడు నెలల పాటు ఈ వ్యాపారాన్ని రహస్యంగా సాగించాడు.
విశ్వసనీయ సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఆంటోనీ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించి, వైన్ బాటిళ్లు, తయారీ పరికరాలు, ఇతర సామగ్రిని పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, అనంతరం రిమాండ్‌కు తరలించారు.
లైసెన్స్ లేకుండా మద్యం తయారు చేయడం చట్టరీత్యా నేరమని, ప్రయోగశాల పరీక్షలు లేని మద్యం సేవించడం వల్ల విష ప్రభావం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.







