90వ దశకంలో తన కామెడీ, డ్యాన్స్‌తో బాలీవుడ్‌ను ఏలిన గోవింద దాదాపు ఏడేళ్ల తర్వాత 'రూపా' అనే కొత్త చిత్రంతో వెండితెరపైకి వస్తున్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా నటి రాణి స్వర్ణకర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.

తన ప్రయాణం గురించి మాట్లాడిన గోవింద, తాను పేదరికం నుంచి వచ్చానని, చిన్ననాటి నుంచి కుటుంబ బాధ్యతలే తనకు ప్రధానమని వెల్లడించారు. డబ్బు విలువను ప్రత్యక్షంగా చూసిన తాను, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నానని అన్నారు. పెద్ద సినీ ప్రముఖుల నుంచి అవకాశాలు రాకపోయినా, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించానని ఆయన తెలిపారు.

దక్షిణాది సినిమాల గురించి మాట్లాడుతూ, రాబోయే పదేళ్లు తాను ఆ సినిమాలపై దృష్టి పెడతానని గోవింద స్పష్టం చేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన 'వాంటెడ్', అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ రీమేక్ చిత్రాల విజయాలను ప్రస్తావిస్తూ, దక్షిణాది కథలే హిందీ సినిమాలకు కొత్త ఊపునిచ్చాయని అన్నారు. బాలీవుడ్ రాజకీయాల్లో తనను చాలాసార్లు పట్టించుకోలేదని, ఇకపై సినిమాల్లో కనిపించరని అనుకున్నారని, కానీ తాను వెనక్కి తగ్గలేదని ఆయన అన్నారు.

మళ్లీ కొత్త ప్రయాణం మొదలుపెట్టిన తనను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని, మంచి విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని గోవింద అన్నారు. ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్లతో నెంబర్ వన్ హీరోగా నిలిచిన ఆయన, 'రూపా'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.