రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందించారు. నామినేషన్ పత్రాల సమర్పణలో అభ్యర్థులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన శుక్రవారం మీడియాకు తెలిపారు.
నామినేషన్ ఫారమ్‌లోని ప్రతి కాలమ్‌ను నింపడం తప్పనిసరి అని, ఏ సమాచారాన్ని దాచినా నామినేషన్ చెల్లదని ఆయన స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్ తనపై ఉన్న కోర్టు కేసు వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనకపోవడమే నామినేషన్ తిరస్కరణకు ప్రధాన కారణమని ఆయన వివరించారు.
ఈ లోపాలను సరిదిద్దుకునేందుకు రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్‌కు తగిన సమయం ఇచ్చారు. అయితే, ఆ అవకాశాన్ని ఆమె వినియోగించుకోలేదని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. పత్రాల్లోని లోపాలను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.
రిటర్నింగ్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని జ్ఞానేష్ కుమార్ గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం అభ్యర్థులు పూర్తి సమాచారాన్ని వెల్లడించాల్సిందేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు.








