ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా అవతరించిన కొద్ది రోజులకే, ఎలాన్ మస్క్ 'స్పేస్‌ఎక్స్' అనూహ్యమైన ఎదురుదెబ్బను చవిచూసింది. కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ సంస్థ, మార్కెట్ విలువలో 600 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. దీంతో కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు ట్రిలియన్ డాలర్ల కంటే దిగువకు చేరింది.

నాస్‌డాక్‌లో లిస్టింగ్ అయినప్పుడు స్పేస్‌ఎక్స్ షేర్లు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన పొందాయి. ఐపీఓ ధర 135 డాలర్లు ఉండగా, కొద్ది రోజుల్లోనే దాదాపు 67 శాతం పెరిగి 225 డాలర్ల స్థాయికి చేరాయి. ఆ సమయంలో కంపెనీ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరి, ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల జాబితాలో అగ్రస్థానాలకు చేరుకుంది. అయితే.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రారంభ ఉత్సాహం తగ్గిపోవడంతో, పెట్టుబడిదారులు కంపెనీ వాస్తవ ఆర్థిక పరిస్థితులపై దృష్టి పెట్టడం ప్రారంభించారు.

స్పేస్‌ఎక్స్ కమర్షియల్ స్పేస్ లాంచ్‌లు, స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు, ఏఐ రంగాల్లో బలమైన స్థానం సంపాదించింది. అయినప్పటికీ.. కంపెనీ విలువ చాలా ఎక్కువగా ఉండటం, ఏఐ ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేయడం, అప్పులు పెరగడం వంటి అంశాలు పెట్టుబడిదారుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇటీవల కంపెనీ కొత్త షేర్లు విడుదల చేయకుండా.. స్వల్పకాలిక అప్పులను తీర్చేందుకు బాండ్‌ల ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించడం కూడా మార్కెట్‌లో మిశ్రమ సంకేతాలకు కారణం అయింది.

స్పేస్‌ఎక్స్‌లో సుమారు 38 శాతం వాటా కలిగిన ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఈ పతనం వల్ల భారీగా తగ్గింది. కంపెనీ షేర్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు పోలిస్తే, మస్క్ సంపద దాదాపు 350 బిలియన్ డాలర్లు తగ్గినట్లు అంచనా. ప్రస్తుతం ఆయన నికర సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతం షేర్ ధరల్లో భారీ తగ్గుల కనిపిస్తున్నప్పటికీ, స్పేస్‌ఎక్స్ ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా.. కంపెనీ త్వరలో నాస్‌డాక్‌-100 సూచీలో చేరే అవకాశం ఉండటంతో, ఇండెక్స్ ఫండ్లు, పెద్ద పెట్టుబడిదారుల నుంచి అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశముంది.

ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!