ఖమ్మం జిల్లాలో రూ.40 కోట్లతో ఆధునిక హరిత భవన్ నిర్మాణ ప్రణాళికకు అధికారులు ఆమోదం తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పర్యాటక శాఖ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఈ ప్రాజెక్ట్ వివరాలను పంచుకున్నారు.

ప్రస్తుతం లకారం పార్క్ సమీపంలోని 5 ఎకరాల్లో ఈ భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా 'హరిత హోటల్' అనే ప్రాథమిక పేరును మార్చి 'హరిత భవన్'గా మళ్లీ పేరు పెట్టాలని మంత్రి తుమ్మల ప్రత్యేక సూచన చేశారు.

ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మంత్రి తుమ్మల ప్రత్యేక లేఖ రాశారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే 5 ఎకరాల భూమిని కేటాయించినట్లు, భవనం ఉపయోగాల వివరాలను లేఖలో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తుమ్మల భావిస్తున్నారు. నిధులు కేటాయించి టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.