జూనియర్ ఎన్టీఆర్ పేరుతో 'రా ఎన్టీఆర్' అభిమాన సంఘం నిర్వహిస్తున్న 'ఊరు-వాడ' కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఈ నెల 18న తిరుపతిలో జరగనున్న ఈ ఈవెంట్ వెనుక జరుగుతున్న పరిణామాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అనుమతి లేకుండానే ఆయన పేరును వాడుకుంటూ దందా చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా స్పందించింది. రా ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు గానీ, ఆయన సన్నిహితులకు గానీ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆయన ప్రమేయం లేకుండానే ఈ కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొంటూ, అభిమానులను సున్నితంగా హెచ్చరించింది.
అంతేకాకుండా, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన కార్యాలయం ఖండించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చిచెప్పింది.
తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర ఫ్యాన్స్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఈ అంశంపై మరింత వివరణ ఇచ్చారు. రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే సంస్థకు జూనియర్ ఎన్టీఆర్ తో కానీ, నందమూరి అభిమాన సంఘాలతో కానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన అధికారికంగా ప్రకటించారు.








