టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ జీవితంలో తండ్రి, అన్నయ్య అకాల మరణాలు పెను విషాదాలని మిగిల్చాయి. ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ 1986 అక్టోబరు 21న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు అప్పుడు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో గోపీచంద్ వయసు కేవలం 8 ఏళ్లు.
తండ్రి బాటలోనే దర్శకుడు కావాలని కలలు కన్న గోపీచంద్ సోదరుడు ప్రేమ్ చంద్ కూడా అకాల మరణం పాలయ్యాడు. 'అమ్మాయి కాపురం' సినిమా షూటింగ్ కోసం సోడా బండి తీసుకురావడానికి వెళ్లిన ప్రేమ్ చంద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నటుడు మాదాల రవి చెప్పిన వివరాల ప్రకారం, డ్రైవర్ నెమ్మదిగా వెళ్తుండటంతో ప్రేమ్ చంద్ స్వయంగా డ్రైవింగ్ చేస్తానని ముందుకు వచ్చాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న నిమిషానికే లారీ వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో స్పాట్‌లోనే ప్రేమ్ చంద్ మరణించాడు. అప్పుడు ఆయన వయసు కేవలం 19 సంవత్సరాలు.
ఈ దుర్ఘటన జరిగినప్పుడు గోపీచంద్ రష్యాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వీసా సమస్యల కారణంగా అన్నయ్య అంత్యక్రియలకు కూడా ఆయన రాలేకపోయాడు. తండ్రి, అన్నయ్య మరణాలతో గోపీచంద్ తీవ్రంగా కుంగిపోయాడు. అయితే కుటుంబ బాధ్యతలు తనపై ఉండటంతో త్వరగా కోలుకుని హీరోగా స్థిరపడ్డాడు. 'తొలివలపు' చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన, తర్వాత 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం', 'లౌక్యం', 'సాహసం', 'జిల్', 'గౌతమ్ నంద', 'సీటీమార్', 'భీమా', 'విశ్వం' వంటి సూపర్ హిట్ సినిమాలతో మాచో స్టార్‌గా ఎదిగారు.







