వర్షాకాలంలో మార్కెట్ నుంచి తీసుకునే పాలకూర, మెంతి, కొత్తిమీర వంటి ఆకుకూరలపై చిన్న పురుగులు, గుడ్లు మరియు మట్టి పేరుకుపోతాయి. ఇవి సరిగ్గా శుభ్రం చేయకుండా తిస్తే కడుపునొప్పి లేదా ఇన్ఫెక్షన్లు కలుగుతాయి.
మొదట కూరల్లో పసుపు రంగులో మారిన, కుళ్ళిన ఆకులను తీసేయాలి. ఆ తర్వాత ఒక పెద్ద పాత్రలో శుభ్రమైన నీటిలో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. ఆకులను ఈ ఉప్పు నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. ఈ పద్ధతి కంటికి కనిపించని పురుగులు మరియు పెస్టిసైడ్ల అవశేషాలను తొలగిస్తుంది.
రసాయనాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, ఒక లీటర్ నీటికి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా లేదా 2-3 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ కలపాలి. ఆకులను ఈ ద్రావణంలో 10 నిమిషాలు ఉంచాలి. ఇలా చేస్తే ప్రమాదకర క్రిములు మరియు రసాయన ఘాటు గణనీయంగా తగ్గుతుంది.
శుభ్రపరచడం పూర్తయిన తర్వాత పంపు కింద పారుతున్న నీటిలో ఆకులను విడివిడిగా కడగాలి. పాలకూర కొమ్మల మధ్య ఉన్న ఇసుక తీసేందుకు ఇదే అత్యంత సురక్షితమైన మార్గం. ఆకులను ముందుగా కోసి కడగకుండా, పూర్తిగా కడిగిన తర్వాతే కోయాలి. ముందుగా కోసి కడిగితే విటమిన్లు నీటిలో కొట్టుకుపోతాయి.
ఫ్రిజ్‌లో పెట్టాలనుకుంటే ఆకులను కడగకుండా పచ్చగా ఉంచి, పేపర్ టవల్ లేదా కాటన్ గుడ్డలో చుట్టి ఉంచాలి. తేమ నియంత్రించడం వల్ల ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో ఆకుకూరలను పచ్చగా తినడం కంటే బాగా ఉడికించి వండుకుని తినడం ఆరోగ్యానికి ఎక్కువ సురక్షితం.








