ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీస్ పింక్ బూత్ ఎదుటే ఓ యువకుడు తీవ్ర రక్తస్రావంతో 40 నిమిషాల పాటు సహాయం కోసం వేడుకుంటూ ప్రాణాలు విడిచాడు. బీహార్‌కు చెందిన 25 ఏళ్ల రాజ్ కుమార్ అనే యువకుడు ఉపాధి వెతుక్కుంటూ అక్కడ నివాసం ఉంటున్నాడు. 2026 జూలై 12న ఆటో చార్జీ విషయంలో డ్రైవర్‌తో వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహించిన డ్రైవర్ అతనిపై దాడికి పాల్పడ్డాడు.

ప్రాణభయంతో పరుగులు తీసిన రాజ్ కుమార్ సమీపంలోని మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీస్ పింక్ బూత్ వద్దకు చేరుకున్నాడు. బూత్ మూసి ఉండటంతో లోపలి సిబ్బందిని పిలిచేందుకు గ్లాస్ డోర్‌ను గట్టిగా కొట్టగా, అది పగిలి అతని చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావమవుతున్నా బూత్ లోపలి మహిళా పోలీసులు బయటకు రాలేదు, స్థానికులు కూడా పట్టించుకోలేదు.

దాదాపు 40 నిమిషాల పాటు రోడ్డుపైనే సహాయం కోసం గోరిన రాజ్ కుమార్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో నెటిజన్లు పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇద్దరూ మద్యం మత్తులో గొడవపడ్డారని, గాయపడిన వెంటనే ఆస్పత్రికి తరలించామని వాదిస్తున్నారు.

ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ అమానవీయ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.