హర్యానా, పంజాబ్ మరియు చండీగఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు జింద్ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఇక్కడ దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ రైలు జింద్-సోనిపట్ మార్గంలో ప్రయాణిస్తుంది.

ఈ హైడ్రోజన్ రైలు పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. దీని నుంచి ఎలాంటి హానికరమైన పొగ విడుదల కాదు. రెండు డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ప్యాసింజర్ కోచ్‌లతో కలిపి మొత్తం 10 కోచ్‌లు ఉన్న ఈ రైలులో ఒకేసారి 2,600 మంది ప్రయాణించవచ్చు. గంటకు 75 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు, రోజుకు రెండు రౌండ్ ట్రిప్పుల ద్వారా 356 కిలోమీటర్ల దూరం సేవలు అందిస్తుంది.

హైడ్రోజన్ రైలు ప్రారంభంతో పాటు, కురుక్షేత్రలో సిక్కు మ్యూజియానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే చండీగఢ్‌లో రూ. 6,600 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, పీజీఐఎంఈఆర్‌లో కొత్త కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ హైవేను జాతికి అంకితం చేయడంతో పాటు, 75 అమృత్ భారత్ స్టేషన్లను ఆయన ప్రారంభించనున్నారు.

మంగళగిరి, రాయనపాడు, కంబం రైల్వే స్టేషన్లతో పాటు కర్టోలి–అంబాలా మరియు అమృత్‌సర్ (ఛెహర్తా)–వారణాసి మధ్య కొత్త రైలు సర్వీసులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలుగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టుతో, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి రైళ్లను తీసుకురావాలని రైల్వేశాఖ యోచిస్తోంది.