ఖమ్మం జిల్లాలో వానలు ముఖం చాటేయడంతో రైతులు పండించిన పంటలు ఎండిపోతున్నాయి. జూలై 14 నాటికి జిల్లాలో 6.50 లక్షల ఎకరాల సాగు లక్ష్యంలో కేవలం 3 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయ్యింది. దీంతో సాగు శాతం 48కి చేరుకోగా, మిగిలిన భూముల్లో విత్తనాలు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు.
గత ఐదు రోజులుగా వర్షాలు లేకపోవడంతో జూన్ చివరలో నాటిన పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. వరి నారుమడుల్లో నారు ముదిరిపోతుండగా, పొలాల్లోకి నాట్లు వేయలేని పరిస్థితి నెలకొంది. రఘునాథపాలెం మండలం వేపకుంట్లకు చెందిన రైతు కూరపాటి శ్రీనివాసరావు విత్తనాలు, ఎరువుల కోసం పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసినట్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువ పంటల విస్తీర్ణం సాగు కాలేదని అంచనా. వరి సాగు లక్ష్యం 3.20 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 60 వేల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. పత్తి సాగు విషయంలో 2.70 లక్షల ఎకరాల లక్ష్యంలో 1.75 లక్షల ఎకరాల్లో సాగు జరిగినప్పటికీ, మొలకెత్తని పంటలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ముందస్తు ఎల్‌నినో హెచ్చరికల కారణంగా తాను ఇంకా సాగు ప్రారంభించలేదని చిమ్మపూడికి చెందిన మహిళా రైతు దొంతు భాగ్యమ్మ తెలిపారు. వాతావరణం మేఘావృతమై కనిపిస్తున్నప్పటికీ వాన జాడ లేక రైతుల్లో అయోమయం నెలకొంది. రెండు మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే మొత్తం మొలకలు ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు.








