కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఆడబిడ్డలు, అన్నదాతలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా ఏ ఒక్కరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్న సమయంలో, సాగునీటి కోసం అడుగుతున్న రైతులపై ముఖ్యమంత్రి చేసిన 'రక్తం పారిస్తా' వంటి వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'యూత్ డిక్లరేషన్' కూడా భారీ మోసమని ఆయన దుయ్యబట్టారు. ఈ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో భారీ యువజన సభను నిర్వహించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.