తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్న 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు మొత్తం రూ.21.40 కోట్ల విలువైన ఆర్థిక సహాయం అందనుంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని సెర్ప్‌ పథకం ద్వారా ఈ నిధులు మంజూరయ్యాయి. మహిళలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా, స్వంతంగా పరిశ్రమలు నెలకొల్పే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

హైదరాబాద్‌లోని బిట్స్‌పిలానీ, టీ–హబ్‌లను 'హైదరాబాద్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లు' (టీబీఐ)గా అధికారికంగా నామినేట్ చేశారు. ఈ రెండు సంస్థలకు చెరో రూ.10.70 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఈ మొత్తంతో ఎంపికైన మహిళలకు మార్కెటింగ్, బ్రాండింగ్ సేవలు, వ్యాపార సలహాలు అందించడంతోపాటు, సున్నా వడ్డీతో సాఫ్ట్‌లోన్లు, గ్రాంట్లు అందజేస్తారు.

లాభదాయకంగా నడుస్తున్న వ్యాపారాలను నడిపిస్తున్న 300 మందిని ఎంపిక చేసి, వారికి మూడేళ్లపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కో ఇంక్యుబేటర్ కింద 150 మందికి సహకారం అందుతుంది. ఈ 300 మందిలో 36 మందికి (ఒక్కో ఇంక్యుబేటర్‌కు 18 మంది చొప్పున) నేరుగా గ్రాంట్లు ఇవ్వగా, మిగిలిన వారికి సున్నా శాతం వడ్డీతో రుణాలు అందిస్తారు.

రాష్ట్ర స్థాయిలో మే 29న ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జిల్లా, మండల, గ్రామ స్థాయిలకు విస్తరించనున్నారు. ఫీల్డ్ కేడర్, స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు), విలేజీ ఆర్గనైజర్లు, మండల సమాఖ్యల వేదికగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి, దరఖాస్తు ప్రక్రియలో సహకరించేలా మొబిలైజేషన్ కార్యక్రమాలు చేపడతారు.

పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి జిల్లా స్థాయిలో 'ఇంక్యుబేటర్ లాంచ్ ఈవెంట్'లు నిర్వహించి, 30వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా బాధ్యతలు పంచారు: ఆదిలాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి వరకు 15 జిల్లాలను టీ–హబ్‌కు, హనుమకొండ నుంచి వనపర్తి వరకు 16 జిల్లాలను బిట్స్‌పిలానీ–హైదరాబాద్‌కు కేటాయించారు.