తాడేపల్లిగూడెం వైసీపీలో జూనియర్, సీనియర్ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం మధ్య విభేదాలు ముదిరడంతో పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు బహిరంగ సవాళ్లు విసురుకోవడం చర్చనీయాంశమైంది.
2024 ఎన్నికల ఓటమి తర్వాత అధిష్టానం కొట్టు సత్యనారాయణను ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాంకు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. అవకాశం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో కొట్టు ఉండగా, వచ్చిన ఛాన్స్‌ను పూర్తిగా వాడుకోవాలనే తాపత్రయంతో వడ్డీ రఘురాం ముందుకు సాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు, జాయినింగ్స్ పెంచే విషయంలో రఘురాం జాగ్రత్తగా వ్యవహరిస్తుండగా, మాజీ డిప్యూటీ సీఎంని పట్టించుకోకపోవడం వర్గపోరుకు కారణమవుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి తానే అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవ్వాలని వడ్డీ రఘురాం లక్ష్యంగా పెట్టుకున్నారని, అదే సమయంలో ఆయనకు కొట్టు సత్యనారాయణ గట్టిగా అడ్డుతగులుతున్నారని స్థానిక నేతలు చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడంలో కొత్త ఇన్ఛార్జ్ విఫలమవుతున్నారని కొట్టు విమర్శిస్తుండగా, అధినేత జగన్ త్వరలోనే ఇన్ఛార్జ్ పదవి విషయంలో జరిగిన తప్పును గ్రహిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనికి కౌంటర్‌గా వడ్డీ వర్గం.. అధినేత మిమ్మల్ని పక్కన పెట్టడం వెనుక కారణం మీరు చూపాల్సినంత ప్రతాపం చూపలేకపోవడమేనని, ఇప్పుడు పార్టీ బలం పుంజుకుందంటే అది తమ పనితనమేనని ఘాటుగా స్పందించింది.
సీనియర్ నాయకుడిగా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి, పనిచేస్తున్న నేతలపై సెటైర్లు వేయడం తగదని వడ్డీ వర్గం ఘాటుగా ప్రశ్నిస్తోంది. తోటి మాజీ మంత్రులపై దాడులు జరిగినప్పుడు కొట్టు ఎక్కడున్నారని, కాపుల సభకు హాజరైన ఆయన దాడులకు గురైన సహచరులను పలకరించడంలో ఎందుకు వెనుకపడ్డారని నిలదీస్తోంది. 2014లో ఎక్కడున్నారని వైసీపీ ఇప్పుడు బలంగా ఉందని చెప్పుకునే నేతలను ప్రశ్నిస్తోంది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఫాలో అవ్వాల్సిన మాజీ డిప్యూటీ సీఎం.. అవకాశం కోసం చేస్తున్న పోరాటాన్ని పార్టీ పెద్దలు ఎలా చూస్తారనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారింది.








