ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం 'ఫౌజీ' విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం అధికారికంగా వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. 1940 దశకం నాటి స్వాతంత్య్ర సంగ్రామం, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే కల్పిత కథ ఇది. విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ కదనరంగంలో గాయపడి, రక్తంతో తడిసిన దుస్తుల్లో కనిపిస్తున్నారు. చేతిలో బందూక్ పట్టుకుని ఆయన ఉన్న తీరు, సినిమాలో ఉండబోయే భావోద్వేగాలను తెలియజేస్తోంది.
పోస్టర్‌పై '1932 నుంచి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు' అని రాసి ఉన్న స్టాంప్ కథపై ఆసక్తిని పెంచుతోంది. ఒక యోధుడి త్యాగం, ధీరత్వాన్ని ఈ సినిమా ప్రతిబింబిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సినిమాలో ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హను రాఘవపూడి ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.







