Iranian Oil : ఇరాన్ చమురుపై ఎన్నో ఏళ్లుగా విధించిన ఆంక్షల్ని అమెరికా తాజాగా ఎత్తివేసింది. తాజాగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల అనంతరం కుదిరిన ఒప్పందంలో భాగంగా 60 రోజులపాటు ఇరాన్ చమురుపై ఆంక్షల్ని అమెరికా తొలగించింది. అయితే, ఇప్పుడు ఇరాన్ నుంచి ఇండియా చమురు కొంటుందా అనే చర్చ జరుగుతోంది. ఇరాన్‌ చమురుపై అమెరికా చాలా ఏళ్లుగా ఆంక్షలు విధించింది. మధ్యలో కొన్నిసార్లు తొలగించినప్పటికీ.. చివరగా 2018 నుంచి ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంటే, ఇరాన్ చమురును ఏ దేశాలూ కొనకూడదు. ఒకవేళ కంటే ఆ దేశాలపై అమెరికా కక్షసాధింపు చర్యలకు దిగుతుంది.

అంటే, ఇరాన్ చమురు కొన్న దేశాల ఉత్పత్తులపై అమెరికా ఎక్కువ పన్నులు, వాణిజ్య పరమైన ఆంక్షలు విధిస్తుంది. దీంతో అమెరికాతో వైరం ఎందుకు అనుకున్న ఇండియా ఇరాన్ చమురును కొనుగోలు చేయడం లేదు. అయినప్పటికీ ఇరాన్, ఇండియా మధ్య ఇతర వాణిజ్యం కొనసాగుతోంది. ఇరాన్ నుంచి గతంలో ఇండియాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, టర్కీ, గ్రీస్, తైవాన్ దేశాలు ఎక్కువగా చమురు కొనేవి. ఇప్పుడు ఆ దేశాలకు కూడా ఇరాన్ చమురు సరఫరా చేసే అవకాశం ఉంది. ఇరాన్ చమురును అత్యధికంగా ఇంతకాలం కొన్నది మాత్రం చైనానే. అమెరికా ఆంక్షల్ని లెక్కచేయకుండా ఆ దేశం ఇరాన్ చమురు కొనుగోలు చేసింది. ఇక, చాలా ఏళ్లుగా ఇరాన్ నుంచి ఇండియా ఆయిల్ కొనడం లేదు. సాధారణంగా ఆంక్షలు ఉన్న దేశాల నుంచి ఇండియా చమురు కొనుగోలు చేయదు. అయితే, ఇప్పుడు ఇరాన్ చమురును ఇండియా కొనుగోలు చేసే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా. దీనికి కారణం.. ఇతర దేశాలతో పోలిస్తే ఇరాన్.. ఇండియాకు చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడినుంచి రెండు లేదా మూడు రోజుల్లోనే చమురు నౌకలు ఇండియా చేరుకుంటాయి.

దీంతో మన కంపెనీలకు త్వరగా చమురు సరిపడినంత అందుతుంది. పైగా, ప్రస్తుత ఆంక్షల సడలింపు 60 రోజులు మాత్రమే. అంటే, ఆ లోపే ఇతర దేశాలకు ఇరాన్ చమురును అమ్మేసుకోవాలి. అందువల్ల అవసరమైతే ఆయా దేశాలకు తక్కువ ధరకే చమురు సరఫరా చేసే అవకాశాలున్నాయి. దీంతో ఇండియన్ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు.. ఇరాన్ కంపెనీలతో బేరమాడి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేయవచ్చు. ఇరాన్ కూడా తక్కువ ధరకైనా సరే వీలైనంత చమురును అమ్మేసుకుని లబ్ధి పొందాలని చూస్తోంది. ఇది ఇండియాకు లాభించే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే ఇరాన్ చమురు నౌకలు కొన్ని ఇండియా రిఫైనరీలకు తరలినట్లు సమాచారం.